: గ్రీస్ ఎంపీలకు రాత్రి నిద్రలేదు!
గ్రీస్ ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అక్కడి నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపధ్యంలో మూడో బెయిల్ అవుట్ ప్రణాళికపై గత రాత్రంతా గ్రీస్ ఎంపీలు సుదీర్ఘంగా చర్చించారు. సుదీర్ఘ చర్చ అనంతరం దేశాన్ని ఆదుకునేందుకు మూడో బెయిల్ అవుట్ ప్యాకేజీకి గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. 85 బిలియన్ యూరోల బెయిల్ అవుట్ ప్యాకేజీని మెజారీటీ ఎంపీలు ఆమోదించారు. గ్రీస్ పార్లమెంటు సమావేశానికి ముందు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల ఆర్ధిక మంత్రులు సమావేశమై, బెయిల్ అవుట్ ప్యాకేజీపై జర్మనీ పెడుతున్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని గ్రీస్ ప్రధానికి సూచించారు. కాగా, బెయిల్ అవుట్ ప్యాకేజీపై జర్మనీ పెడుతున్న అదనపు నిబంధనలను వ్యతిరేకించాలని ఈయూ అర్ధిక మంత్రులను గ్రీస్ ప్రధాని సిప్రాస్ కోరారు. కాగా, గ్రీస్ కు భారీ ఎత్తున ఆర్ధిక సాయం చేసిన దేశాల్లో జర్మనీదే అగ్రభాగం అన్న విషయం తెలిసిందే.