: తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేతకు అనుమతించండి!: కేంద్రానికి ఏపీ లేఖ!


ఏపీ విద్యుత్ శాఖకు బకాయి ఉన్న నిధులను చెల్లించడంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున, ఆ రాష్ట్రానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికి అనుమతి కోరుతూ ఏపీ జెన్ కో కేంద్రానికి లేఖ రాయనుంది. తెలంగాణ నుంచి బకాయిలు రాని కారణంగా, తాము సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ఈ విషయమై తెలంగాణ జెన్ కోకు రెండుసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఏపీ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకుంటే సరఫరా ఆపివేయవచ్చని విద్యుత్ చట్టంలో ఉన్నందున టీఎస్- జెన్ కోకు దీన్ని వర్తింపజేస్తామని కేంద్రానికి స్పష్టం చేయనున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు 53.89, ఏపీకి 46.11 శాతం విద్యుత్ ను పంచగా, తెలంగాణ అదనంగా 790 మెగావాట్లను ఏపీ నుంచి వాడుకుంటోంది. ఈ అదనపు వాడకం నిమిత్తం రూ. 1,384 కోట్లను కేసీఆర్ సర్కారు చెల్లించాల్సివుండగా, ఒక్క రూపాయి కూడా ఇంతవరకూ జమ చేయలేదన్నది ఏపీ జెన్ కో అభియోగం. ఈ బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ ను నిలిపివేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News