: కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు... మత్తయ్య, సెబాస్టియన్ లవి కూడా!


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసీబీ అధికారులు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా అరెస్ట్ చేయగా, కోర్టు నుంచి వీరు బెయిలు పొందిన సంగతి మనకు తెలిసిందే. ఇక, ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారిన ఆడియో, వీడియో టేపుల వాస్తవికతను నిర్ధారిస్తూ రూపొందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఏసీబీ కోర్టుకు చేరింది. తాజాగా ఆ టేపుల్లోని స్వరాలతో నిందితుల స్వరాలను పరిశీలించే ప్రక్రియకు కూడా తెర లేచింది. కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల స్వర నమూనాలను అందించాలన్న ఏసీబీ కోర్టు అభ్యర్థనకు తెలంగాణ అసెంబ్లీ స్పందించింది. ఆయా సందర్భాల్లో రేవంత్, సండ్రలు ప్రసంగించిన ఆడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు నిన్న కోర్టుకు సమర్పించారు. అదే సమయంలో కేసులో మరో కీలక నిందితుడిగా ఉంటూనే ఏసీబీ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన జెరూసలెం మత్తయ్యతో పాటు మరో నిందితుడు సెబాస్టియన్ లు వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడిన ఆడియో ఫుటేజీలను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. అసలు టేపులతో నిందితుల స్వరాలను పోల్చేందుకు అందిన స్వర నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని ఏసీబీ అధికారులు నిన్ననే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడో, రేపో కోర్టు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News