: కడియం శ్రీహరి చెప్పిన 'కుక్క-ఎద్దు' కథ... ఎర్రబెల్లిపై సెటైర్!
తనపై తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన విమర్శలను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. ఎర్రబెల్లి ఆరోపణలపై మాట్లాడటం ఇష్టం లేకపోయినా, ప్రజల కోసం మాట్లాడాల్సి వస్తోందని అంటూ, ఆయనో 'కుక్క-ఎద్దు' కథ చెప్పారు. "ఒక మంచి ఎండాకాలంలో వేడికి తట్టుకోలేక ఓ కుక్క అలమటిస్తోంది. ఆ దారిగా ఓ రైతు తన గడ్డిని ఎడ్ల బండిలో వేసుకుని వస్తున్నాడు. ఆ బండిని చూసిన కుక్క, దాని నీడలో నడుస్తూ ఇంటికి వచ్చింది. ఆపై 'ఆహా... ఇంత పెద్ద బండిని నేనే లాక్కొచ్చాను' అని అనుకుందట. మరోవైపు ఎద్దు కాస్తంత ఆయాసపడుతూ కనిపించగానే, 'నేను చిన్నగా ఉన్నా ఆయాసపడకుండా బండిని లాక్కొచ్చాను. నువ్వు ఇంత లావుగా ఉండి కూడా ఎందుకు ఆయాసపడుతున్నావు?' అని ప్రశ్నించిందట. ఎద్దు కుక్కవైపు జాలిగా చూసి, 'దానికేమీ తెలియదులే' అని సైలెంట్ గా ఉండిపోయింది" అని కడియం చెప్పారు. "మీరు ఎర్రబెల్లిని కుక్కతో పోలుస్తున్నారా?" అని మీడియా ప్రశ్నించగా, 'ఆ మాట నేను అనలేదు. విజ్ఞులైన మీకు అర్థమై ఉంటుంది' అంటూ నవ్వుతూ తప్పించుకున్నారు.