: పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని!: చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అవుతుందని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకచోట ఉన్నప్పుడు ఒకరి కింద ఒకరు పనిచేయడం ఉండదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని అంటే రెండు ప్రభుత్వాలకు రాజధాని అనీ, గవర్నర్ కు అధికారాలు అందుకేననీ పునరుద్ఘాటించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వారసత్వంగా దక్కింది సమస్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలకు విభజనలో లోటుపాట్లే కారణమని మండిపడ్డారు. 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 56 శాతం ఆదాయం వస్తోందనీ, అదే సమయంలో 58 శాతం జనాభా ఉన్న ఏపీకి 48 శాతమే ఆదాయం వస్తోందని వివరించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యుత్ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా ముందుకెళ్లకపోతే నష్టపోక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ఏం జరుగుతోందో మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతూ... "ఇవాళ ప్రధాని నాతో ఫోన్లో మాట్లాడారు. ప్రధానికి నా ఆవేదనను, రాష్ట్ర పరిస్థితులను వివరించాను. ఆగస్టు 15 తర్వాత ప్రధాని నన్ను ఢిల్లీ పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఆయనను ఇప్పటివరకు 8 పర్యాయాలు కలిశాను. నిన్న కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో ఫోన్ లో మాట్లాడాను. విభజన చట్టంలో ఉన్న అంశాల అమలు కోసం కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నా. చట్టంలో లేని కొన్ని సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు" అని వివరించారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడారు. "రాజకీయ కోణంలో నన్ను విమర్శించే వాళ్లకు ఏం అర్హత ఉంది? రాజకీయ పబ్బం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. చరిత్రలేని వాళ్లు కూడా నాపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో నా పట్ల ఉన్న విశ్వసనీయతే నన్ను కాపాడుతోంది. ఆయా పార్టీలు, నేతలు వివిధ సందర్భాల్లో చేసిన పనులు ప్రజల ముందు ఉంచుతాను" అని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన మీడియాకు చురకలు వేశారు. మీడియాలో ఇప్పుడు పెడధోరణులు కనిపిస్తున్నాయని అన్నారు. మీడియా మీడియాగా ఉండట్లేదంటూ, పరిధి మీరుతోందన్న కోణంలో ఆరోపణ చేశారు. ఇప్పుడు మీడియాను రాజకీయ కాలుష్యం ఆవహించిందన్నారు.

  • Loading...

More Telugu News