: ఆ ఆరోపణ...వారి వ్యాఖ్యలతో నిజమని తేలింది: శరద్ యాదవ్
పెట్టుబడి దారులు బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయని, పార్లమెంటు సమావేశాలు నడిచేలా చేయాలంటూ పారిశ్రామిక వేత్తలు బయటి నుంచి చెప్పడం ద్వారా ఆ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయిందని జేడీయూ నేత శరద్ యాదవ్ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలు జరగనివ్వాలంటూ ట్వీట్ చేసిన పారిశ్రామిక వేత్తలపై మండిపడ్డారు. పార్లమెంటు ఎలా పనిచేయాలో చెప్పడానికి పారిశ్రామిక వేత్తలు ఎవరు? అని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అండతోనే వారు రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి పార్లమెంటును సజావుగా నడపాలంటూ ప్రతిపక్ష నేతలకు పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారని, తమను 125 కోట్ల మంది భారతీయులు ఎన్నుకున్నారన్న విషయం వారు గుర్తించాలని ఆయన సూచించారు. కాగా, పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడంతో భారత వాణిజ్య రంగానికి ఊతం ఇచ్చే వస్తు సేవల బిల్లు పెండింగ్ లో పడిపోయింది. దీంతో 15 వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలు పార్లమెంటును అడ్డుకోరాదని, సజావుగా సాగేలా చూడాలని విపక్ష పార్టీలకు సోషల్ మీడియా మాధ్యమంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.