: కర్ణాటక అడవుల్లో దారితెలియక అలమటించిపోయిన హైదరాబాద్ ట్రెక్కర్లు
హైదరాబాదుకు చెందిన ఇద్దరు ట్రెక్కర్లు కర్ణాటక అడవుల్లో దారితప్పి ఆకలిదప్పులతో తీవ్ర యాతన పడ్డారు. దాదాపు 48 గంటల సెర్చ్ ఆపరేషన్ అనంతరం వారి ఆచూకీ తెలుసుకున్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, యాంటీ నక్సల్ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. హైదరాబాదుకు చెందిన 11 మంది ట్రెక్కర్ల బృందం ఆదివారం ట్రెక్కింగ్ చేస్తుండగా, వివేక్ గుప్తా (31), శశిధర్ (27) దారితప్పారు. ఈ సమాచారం తెలుసుకున్న కర్ణాటక అధికారులు వెంటనే స్పందించి బలగాలను రంగంలోకి దింపారు. తీవ్ర ప్రయత్నాల మీదట మంగళవారం రాత్రి చిక్ మగళూరు అటవీప్రాంతంలోని తన్నిగెబైలు రేంజ్ లో ఆ ఇద్దరు హైదరాబాదీలను గుర్తించారు. హెబ్బే జలపాతం వద్ద వారు బాగా అలసిపోయిన స్థితిలో బలగాలకు కనిపించారు. వారి దుస్తులు చినిగిపోయి ఉన్నాయి. నీటిలో దిగిన కారణంగా జలగలు పట్టుకోవడంతో శరీరంపై గాయాలయ్యాయి. వారికి చికిత్స అందించి, స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గుప్తా ఓ ల్యాబ్ టెక్నీషియన్ కాగా, శశిధర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.