: క్వీన్ ఎలిజబెత్ ను హతమార్చేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర!


బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2ను హతమార్చేందుకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు వేసినట్టు వచ్చిన వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. ఎలిజబెత్ తో పాటు సాధ్యమైనంత ఎక్కువ మంది రాజ కుటుంబీకులను చంపేయాలని, అందుకు శనివారం జరిగే వీజే (విక్టరీ ఓవర్ జపాన్) దినోత్సవాన్ని ఎంచుకున్నారని 'స్కై న్యూస్' అండర్ కవర్ నిఘా ప్రతినిధి వెల్లడించారు. ఇందుకోసం ఓ పురుషుడు, మరో మహిళ బ్రిటన్ లోకి ప్రవేశించారని, వీరికి ఐఎస్ఐఎస్ శిక్షణ ఇచ్చి పంపిందని 'స్కై న్యూస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ట్విట్టర్ లోని చాట్ రూంలలో జరుగుతున్న మెసేజ్ ల ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నట్టు వివరించింది. తామొక నకిలీ క్యారెక్టర్ ను సృష్టించగా, నిజమైన ఐఎస్ఐఎస్ జిహాదీలు తమను సంప్రదించారని, నిధులు సమకూర్చేందుకు, ఆయుధాల కొనుగోలుకు సహకరిస్తామని చెప్పారని వివరించింది. గతంలో హాకర్ గా ఉండి, ఇప్పుడు ఐఎస్ఐఎస్ కు సహకరిస్తున్న 21 సంవత్సరాల జునైద్ హుస్సేన్ రిక్రూట్ మెంట్స్ చేస్తున్నాడని, ఆయన భార్య శాలీ జోన్స్ మహిళా ఐఎస్ఐఎస్ మద్దతుదార్లకు సహకరిస్తున్నారని తెలిపింది. ఆమే స్వయంగా ఎలిజబెత్ పై దాడి గురించిన వివరాలు వెల్లడించిందని స్కై న్యూస్ పేర్కొంది. జిహాదీలను సిరియా రావద్దని చెబుతూ, వారు లండన్ లోనే ఉండి దాడులు చేయాలన్న సలహాలు ఇస్తున్నారని తమ ఇన్వెస్టిగేషన్లో తేలినట్టు వెల్లడించింది. బ్రిటన్లో దాడులు జరిపేందుకు సిరియాలో శిక్షణ పొందిన ఐదుగురు వచ్చారని ఐఎస్ఐఎస్ అంతర్గత భద్రతా వ్యవహారాలు చూస్తున్న గెస్టాపో అనే జిహాదీ తెలిపినట్టు వివరించింది. ఈ కథనం తరువాత బ్రిటన్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేసి రాణి తదితర రాజకుటుంబీకులు నివసించే భవంతికి మరింత భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News