: ఈ విమానంతో ఇదే తంటా: అశోక్ గజపతిరాజుకు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్ నుంచి గన్నవరం బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం తెలిసిందే. ఆ విమానంలో ఏపీ ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ విమానం తరచూ ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ఇదే విమానం మూడు రోజుల క్రితం విజయవాడలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిందని బొండా ఉమ చెప్పారు. పలుమార్లు ఇలా జరిగినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలేదని అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పందించిన అశోక్ గజపతిరాజు ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.