: కరవు తప్పదేమో! ప్రణాళికలు రెడీ చేయండి: ఏపీ సర్కారు
ఈ సీజనులో 15వ తేదీలోగా వర్షాలు కురవకుంటే కరవు తప్పదని ఏపీ సర్కారు భావిస్తోంది. బీడు బారుతున్న నేలలతో బోసిపోయిన పలు ప్రాంతాలు 'వానదేవుడా' అని విలపిస్తున్నాయి. నారు మడులు ఎండిపోతున్నాయి. జలాశయాలు ఒట్టి కుండల్లా మారాయి. చెరువులు అడుగంటిపోయాయి. పంట పొలాలు నోర్లు తెరచుకుని ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, ఏపీ గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. రైతులు, సామాన్య ప్రజలు కరవు బారిన పడకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా చూడాలని కోరారు. ఇప్పటికే వేసిన వరిపంటలు, వరినారు దెబ్బతిన్నందున మొక్కజొన్న, మినుము, పెసర తదితర పంటలను రైతులు వేసేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. కాగా, గతేడాది తీవ్ర నష్టాల పాలై ప్రస్తుత ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకున్న రైతులు ఆందోళనలో మునిగిపోయారు. ఈ సీజను ప్రారంభంలో ఊరించిన వర్షాలు, ఆ తరువాత ఉసూరుమనిపించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు మరోసారి కరవు కోరల్లోకి నెట్టబడ్డాయి. ఒకవైపు అతివృష్టితో ఉత్తరాది అల్లాడుతుంటే, అదే వరుణుడి కరుణ లేక కృష్ణా, గోదావరి నదిలో చుక్క నీరు పారడం లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలు అడుగంటగా, సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరు రాకుండా పోయింది. ఈ పొలాల్లో పంట ప్రశ్నార్థకమైంది. కళ్లముందు బీడువారుతున్న భూములు రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఈ పరిస్థితి వ్యవసాయంపై పెను ప్రమాదాన్ని చూపుతోంది. ప్రతియేటా ఈ సమయానికి కళకళలాడే ఎరువుల దుకాణాలు బోసిపోగా, రుణాలిస్తూ బిజీగా కనిపించే బ్యాంకుల్లో సందడి కరవైంది. వర్షాలు కురిపించాలని గ్రామగ్రామానా యజ్ఞయాగాలు, శివాలయాల్లో మహాకుంభాభిషేకాలు జరుగుతున్నాయి. మరి వానదేవుడు కరుణిస్తాడో? లేదో?