: బాబూ... ఎందుకు ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోవు? దిక్కుమాలిన పనులు చేసినందుకేగా?: జగన్ సూటి ప్రశ్న
ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు తెలుగుదేశం పార్టీ ఎందుకు మద్దతు ఉపసంహరించుకోవడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తెలంగాణ సర్కారును ఆస్థిరపరచాలన్న ఆలోచనతో దిక్కుమాలిన పనులు చేసిన బాబు, రూ. 150 కోట్లు పెట్టి తెరాస ఎమ్మెల్యేలను కొనాలని చూశారని, అందులో భాగంగా రేవంత్ రెడ్డితో రూ. 5 కోట్లకు నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఎర వేయించి అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకే బాబు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టి మోదీ కాళ్ల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ విషయం తాను చెబుతున్నది కాదని, పలు జాతీయ పత్రికలు ప్రత్యేక కథనాలుగా ప్రచురించిన విషయమేనని చెబుతూ, ఆ పత్రికలను జగన్ ప్రదర్శించారు. ఇకనైనా కళ్లు తెరిచి హోదా కోసం ఉద్యమించాలని, కేంద్రం ఇవ్వదని భావిస్తే తక్షణం మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, రేపటి నుంచి మరింతగా ఉద్యమాలు జరుగుతాయని జగన్ హెచ్చరించారు. ప్రత్యేక హోదా వస్తే, 90 శాతం నిధులు గ్రాంట్ల రూపంలో వస్తాయని అన్నారు. ఈ నెల 28న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు తెలిపిన జగన్, బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.