: చైన్ స్నాచర్ ను నిలువరించి 'శభాష్' అనిపించుకున్న బీకామ్ విద్యార్థిని
ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్న తనపై దాడి చేసిన దుండగుడిని చొక్కా పట్టుకు నిలువరించిన 19 సంవత్సరాల యువతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల స్వీయ రక్షణపై ఢిల్లీ పోలీసులు ఈమధ్య నిర్వహించిన క్లాసులకు హాజరైన ఓ అమ్మాయికి ఇప్పుడా పాఠాలు అక్కరకు వచ్చాయి. ఓ దొంగ బారి నుంచి తనను తాను కాపాడుకోగలగడమే కాకుండా, ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు పోలీసు బాసుల నుంచి రివార్డు కూడా అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్ కు చెందిన క్రితిక బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలా తన ఇంటికి సమీపంలో చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పి, ఇంటికి వస్తూ తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ నడుస్తోంది. ఓ బైకుపై హెల్మెట్ ధరించి వచ్చిన దొంగ ఆమెపై దాడికి యత్నించాడు. ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించగా, ఆమె దానిని గట్టిగా పట్టుకుని ఉండటంతో విఫలమయ్యాడు. ఆపై తన హెల్మెట్ తో ఆమెను కొట్టాడు. అయినా కూడా ఆమె వెరవక అతని కాలర్ గట్టిగా పట్టుకుని, హెల్ప్ కోసం అరచింది. సమీపంలోని ప్రజలు చోద్యం చూస్తున్నారే తప్ప ఎవరూ సహాయ పడేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటనను సమీపంలోని ఇంటి బాల్కనీలో నుంచి చూస్తున్న వాళ్లమ్మ సైతం సహాయం చేయమంటూ బిగ్గరగా కేకలు పెట్టింది. 'ఇటువంటి ఘటనే మీకు జరిగితే చూస్తూ ఊరుకుంటారా?' అని ప్రశ్నించింది. దీంతో ఓ వ్యక్తి స్పందించి దుండగుడి బైక్ తాళం చేతులు తీసుకోగా, ఇక లాభం లేదనుకుని దుండగుడు పరుగు లంఘించుకున్నాడు. కొందరు యువకులు అతడి వెంట పరిగెత్తి పట్టుకున్నారు. పోలీసులు వచ్చేవరకూ అతనిని బంధించారు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి నలుగురికీ ఆదర్శంగా నిలిచిన క్రితికకు రివార్డులిస్తామని ఢిల్లీ సెంట్రల్ జోన్ డీసీపీ పరమాదిత్య తెలిపారు.