: అక్కడ బతికున్న తాబేళ్లే కీచైన్లు... దగ్గరుంటే అదృష్టం కలిసొస్తుందట!
మీరు ఎప్పుడైనా బతికున్న జంతువులను కీచైన్లుగా వాడారా? చైనాలో ఇప్పుడు అదే లేటెస్ట్ ట్రెండ్. చైనాలో దాదాపు నెల రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బతికున్న తాబేళ్లను కీచైన్లుగా మార్చి విక్రయిస్తున్న సంస్కృతి పెరిగింది. వీటిని సొంతంగా వాడుకునేందుకు, దగ్గరి బంధువులకు, మిత్రులకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలు కొంటున్నారు. వీటిని దగ్గరుంచుకుంటే అదృష్టం కలసి వస్తుందని భావిస్తున్నారు. చిన్న చిన్న తాబేళ్లను సీల్ చేసిన ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి, అందులో విటమిన్లతో కూడిన నీటిని, అవి తినగలిగే చిన్ని జీవులను ఉంచి వాటిని కీచైన్లుగా విక్రయిస్తున్నారు. వీటిని పలువురు లక్ష్మీ కటాక్షం కోసం కొనుగోలు చేస్తుంటే, మరికొందరు వాటిని కొని స్వేచ్ఛ కల్పిస్తున్నారు. చైనా నుంచి పలు వస్తువులు ఇండియాకు స్మగ్లింగ్ అయ్యే ఈ రోజుల్లో తాబేలు కీచైన్లు త్వరలో ఇండియాలో కనిపించినా ఆశ్చర్యం లేదు మరి!