: ఎదురు డబ్బులిచ్చి ఐపీఎల్ లో ఆడతానంటున్న క్రికెటర్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటరూ తపించిపోవడం సహజమే. అనుభవం వస్తుంది, గుర్తింపు లభిస్తుంది, వీటన్నంటికీ మించి భారీ మొత్తంలో పైకం ముడుతుంది! అందుకే ఈ లీగ్ కు ఆటగాళ్లలో అంత క్రేజ్! అయితే, దక్షిణాఫ్రికా-ఎ జట్టు స్పిన్నర్ ఎడ్డీ లీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఐపీఎల్ లో ఆడేందుకు ఎదురు డబ్బులిస్తానంటున్నాడు. అంతకంటే ఆనందకరం మరోటి లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం ఇండియా-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్లతో దక్షిణాఫ్రికా-ఎ టీమ్ ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఈ సందర్భంగా, ఎడ్డీ లీ మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాట వెల్లడించాడు. "ఇప్పటివరకు నేను ఐపీఎల్ లో ఆడలేదు. నన్నెవరూ తీసుకోలేదు. ఆ లీగ్ లో ఆడాలన్నది నా కోరిక. అందుకే, ఐపీఎల్ లో ఆడేందుకు డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటీవలే వెస్టిండీస్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ఆడాను. ఆ లీగ్ లో కొందరు ఇంటర్నేషనల్ స్టార్లున్నారు. అక్కడ బాగానే రాణించాను. కానీ, ఐపీఎల్ చాన్స్ దక్కించుకోలేకపోయాను. ఐపీఎల్ లో మంచి స్పిన్నర్లున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడడకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది?" అని చెప్పుకొచ్చాడు.