: రికార్డులు బద్దలు కొట్టిన దేశీయ రియల్టీ... ముంబైలో రూ.202 కోట్లకు అమ్ముడుబోయిన రెండు ఫ్లోర్లు
భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో రికార్డులు బద్దలవుతున్నాయి. నిలకడ లేని ఆర్థిక ప్రగతితో ఇటీవలి కాలంలో దేశీయ రియల్టీ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోందన్న కొందరి వాదనను పటాపంచలు చేస్తూ ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ ఏకంగా రూ.202 కోట్లకు అమ్ముడుబోయింది. అది కూడా పూర్తి అపార్ట్ మెంట్ అనుకుంటే, మీరు పొరబడినట్లే. దక్షిణ ముంబైలోని నేపియన్ సీ రోడ్డులో ఇంకా నిర్మాణం పూర్తి కాని ‘ద రెసిడెన్స్’ అపార్ట్ మెంట్ లోని రెండు అంతస్తులు మాత్రమేనట. రున్ వాల్ గ్రూప్ నిర్మిస్తున్న ఈ అపార్ట్ మెంట్ కు అభిముఖంగా అరేబియా సముద్ర తీరం కనువిందు చేయనుంది. మొత్తం 17,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ రెండు ఫ్లోర్ల కోసం ఓ వ్యాపార వేత్త ఏకంగా రూ.202 కోట్లను చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని రున్ వాల్ గ్రూప్ డైరెక్టర్ సందీప్ రున్ వాల్ తెలిపారు. అయితే సదరు వ్యాపారవేత్త పేరును వెల్లడించేందుకు రున్ వాల్ అంగీకరించలేదు.