: ఏపీకి ప్రత్యేక హోదా రాదు... అయినా కేంద్రం ఆదుకుంటుంది: మరోసారి కుండబద్దలు కొట్టిన జేసీ
సంచలన ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మారోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన నిన్న అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కుండబద్దలు కొట్టారు. అయితే రాష్ట్రాభివృద్ధికి మాత్రం కేంద్రం నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో కలిసిన సందర్భంగా ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న వాదన వారి మాటల్లో పరోక్షంగా ధ్వనించిందని జేసీ పేర్కొన్నారు. అయితే వారికి రాష్ట్రంపై సానుభూతి ఉందని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీని ఆదుకోవాలన్న సంకల్పం మాత్రం వారి మాటల్లో స్పష్టంగా కనబడిందని జేసీ వ్యాఖ్యానించారు.