: బ్రిటన్ గగనతలంపై సత్తా చాటిన భారత ఫైటర్ జెట్లు


ఇటీవల బ్రిటన్ లో ఇండో-యూకే వాయుసేనల సంయుక్త విన్యాసాలు జరిగాయి. 'ఇంధ్రధనుష్' పేరిట జులై 21న ప్రారంభమైన ఈ విన్యాసాలు 10 రోజుల పాటు జరిగాయి. ఈ జాయింట్ డ్రిల్ లో మన సుఖోయ్ యుద్ధవిమానాలు బ్రిటీష్ ఫైటర్ జెట్లపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. భారత వాయుసేన తరపున శత్రు భీకరమైన సుఖోయ్ ఎస్ యూ-30ఎంకేఐ యుద్ధ విమానాలు బరిలో దిగగా, బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) టైఫూన్ జెట్లను పోటీకి నిలిపింది. గగనతలంలో సాగిన ఈ సంయుక్త విన్యాసాల్లో సుఖోయ్ లు అడుగడుగునా పైచేయి నిరూపించుకున్నాయి. ఓవరాల్ గా 12-0 స్కోరుతో బ్రిటన్ టైఫూన్లకు షాకిచ్చాయి. ఈ విన్యాసాల్లో సుఖోయ్ లకు సీ-17, సీ-130జే హెర్క్యులస్ రవాణా విమానాలు సహకరించాయి. ఇల్యూషిన్ ఐఎల్-78 విమానం గాల్లోనే సుఖోయ్ ల ఇంధన అవసరాలు తీర్చింది. కాగా, ఈ విన్యాసాల సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3 ఆర్ఏఎఫ్ బేస్ లను వినియోగించుకున్నారు. విన్యాసాల్లో పాల్గొన్న 4 సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్లు కానింగ్స్ బై ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి కార్యక్షేత్రంలోకి దూసుకెళ్లగా, రవాణా విమానాలు బ్రిజ్ నోర్టన్ బేస్ కేంద్రంగా యుద్ధ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఇక, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 'గరుడ్' కమాండోలు బ్రిటీష్ కమాండోలతో కలిసి హోనింగ్టన్ బేస్ ను ఉపయోగించుకున్నారు. ఈ జాయింట్ డ్రిల్ పై ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ అశు శ్రీవాస్తవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తమ పైలెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని కితాబిచ్చారు. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటుపడ్డారని, విశేష నైపుణ్యం కనబరిచారని కొనియాడారు.

  • Loading...

More Telugu News