: భార్య తల తీశాడు, శునకాలనూ చంపాడు... దెయ్యాన్ని వదిలించేందుకట!
అమెరికాలోని ఫీనిక్స్ లో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా అంతమొందించాడు. గతనెలలో జరిగిందీ దారుణం. అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తన భార్యకు పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకే ఆమె తల నరికి చంపానని తెలిపాడా వ్యక్తి. కెన్నెత్ డేల్ వేక్ ఫీల్డ్ (43) అనే వ్యక్తి కొంతకాలంగా మతి స్థిమితం కోల్పోయాడు. అయితే, భార్య ట్రినా హీచ్ కు దెయ్యం పట్టిందంటూ ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి, తలను వేరుచేశాడు. అంతేగాదు, రెండు శునకాలను కూడా చంపి వాటి తలలను కూడా వేరుచేశాడు. ఇది గమనించిన పొరుగువ్యక్తి పోలీసులకు సమాచారం అందించగా, వారొచ్చి వేక్ ఫీల్డ్ ను అదుపులోకి తీసుకున్నారు. తాను చూసినప్పుడు వేక్ ఫీల్డ్ ఎడమ మోచేయి వద్ద గాయమై ఉందని, అతడి కుడికన్ను లేదని పొరుగు వ్యక్తి తెలిపాడు. పోలీసులు వచ్చి చూసేసరికి బెడ్ రూంలో హీనా తలలేని స్థితిలో కనిపించిందట. కుక్కలు రక్తపు మడుగులో ఆమె చెంతనే పడి ఉన్నాయి. కాగా, వేక్ ఫీల్డ్ పై ఫస్ట్ డిగ్రీ హత్యానేరంతో పాటు, జంతువధ అభియోగాలను మోపారు.