: రూటు మార్చిన జానా!... కేసీఆర్ పై నిప్పులు చెరిగిన టీ కాంగ్ నేత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రూటు మార్చినట్లే ఉంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల దాకా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాస్తంత మెతక వైఖరి అవలంబించారని ఆయనపై పార్టీ నేతలే బాహాటంగా విమర్శలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేత నిండు సభలో ప్రభుత్వానికి క్షమాపణ చెప్పించారు. ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్న తీరుపై ఇంటా బయట విమర్శల జడివానతో తాజాగా ఆయన తన పంథా మార్చుకున్నారు. నిన్న వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేరుగా సీఎం కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల తూటాలను పేల్చారు. ఉద్యమ నేతగా ఎదిగిన సీఎం కేసీఆర్ కు పాలనా సామర్థం లేదని ఆరోపించిన జానారెడ్డి, కేసీఆర్ కారణంగా అభివృద్ధిలో తెలంగాణ పదేళ్లు వెనక్కెళ్లిపోయిందని నిందించారు. అంతటితో ఆగని ఆయన పనికి రాని మాటలతో కాలయాపన చేస్తూ పాలనను అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.