: జైపూర్ లో శునకాల కోసం ఏసీ హోటల్


పెంపుడు కుక్కలను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న రోజులివి. మనుషులతో సమానంగా చూసుకుంటూ వాటి సౌకర్యాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇలా శునకాల పట్ల కొందరిలో వుండే క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ రాజధాని జైపూర్ లో శునకాల కోసం ఏకంగా ఏసీ హోటల్ కట్టేశారు. ఆ హోటల్ లో 20 కెన్నెల్స్ (కుక్కలు ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసిన గదులు), స్విమ్మింగ్ పూల్, స్పా సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాటిని సంతోషంగా ఉంచేందుకు, పిల్లలతో సమానంగా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే హోటల్ పెట్టామని ఇంటర్నేషనల్ డాగ్ బజార్, రాజస్థాన్ కెన్నల్ క్లబ్ గౌరవ కార్యదర్శి వీరేన్ శర్మ తెలిపారు. ఒక్కో కెన్నెల్ 24 చదరపు అడుగుల విస్తీర్ణంతో హోటల్ ఏర్పాటు చేశామన్నారు. కుక్కల యజమానుల నుంచి మంచి స్పందన వస్తే కెన్నెల్స్ సంఖ్య పెంచుతామన్నారు. కుక్కలను ఉంచేందుకు రోజుకు రూ.599 వసూలు చేస్తామని, కుక్కలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయన్నారు. ఎక్కువ రోజులు తమ హోటల్ లో ఉండే శునకాలకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News