: పోస్టు కార్డు, ఇన్ లాండ్ లెటర్ తో కేంద్రానికి ఎంత నష్టమో తెలుసా?
ఒక్కో పోస్టు కార్డుపై రూ. 7.03, ఒక్కో ఇన్ లాండ్ లెటర్ పై రూ. 4.93 నష్టాన్ని పోస్టల్ విభాగం భరిస్తోందట. ఈ విషయాన్ని పార్లమెంటుకు సమాచార, ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. 2013-14లో సంభవించిన నష్టం ఇదని ఆయన తెలిపారు. రెండు సంవత్సరాల పాటు తగ్గిన పోస్టల్ ట్రాఫిక్ తిరిగి పెరిగినట్టు ఆయన వివరించారు. 2011-12 నుంచి వరుసగా రెండేళ్ల పాటు 3.3 శాతం, 5.2 శాతం తగ్గిన లెటర్ల ట్రాఫిక్, 2013-14లో 1.1 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన తెలిపారు. స్పీడ్ పోస్ట్ విభాగంలో ఈ మూడేళ్లూ వరుసగా 14.8 శాతం, 17.8 శాతం, 7.8 శాతం పెరిగిందని వివరించారు. మొత్తం 18.16 లక్షల స్టాంపులను విక్రయించామని, పర్సనలైజ్డ్ స్టాంపుల విభాగం నుంచి రూ. 4.57 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ స్కీము కింద తమిళనాడు నుంచి అత్యధికంగా రూ. 54.20 లక్షల ఆదాయం రాగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ నుంచి ఆదాయమే లేదని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.