: విద్యార్థినిని దహనం చేసిన దుండగులు... సజీవదహనం చేసుంటారని అనుమానం
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దివ్య (18) అనే విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి దహనం చేశారు. ఈ దారుణ ఘటన జిల్లాలోని గొలిగొండ మండలం అప్పన్నపాలెంలో నిన్న రాత్రి జరిగింది. దివ్య తల్లిదండ్రులు ఊరి చివర ఉన్న జీడిమామిడి తోటలో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. సొంత పనుల నిమిత్తం నర్సీపట్నం వెళ్లిన దివ్య తల్లిదండ్రులు పనులు ముగించుకుని రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో దివ్య వారికి పూర్తిగా కాలిపోయి కనిపించింది. దీంతో, వారు షాక్ కు గురయ్యారు. 18 ఏళ్లపాటు పెంచి, పెద్ద చేసిన కుమర్తె ఆ స్థితిలో కనిపించడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దివ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరూ లేని సమయం చూసి అక్కడకు వచ్చిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.