: పెరిగే వేతనాలతో అన్నీ లాభాలే!


భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టనుంది. ఆరవ వేతన సంఘం సిఫార్సులు దేశ ఆర్థిక వ్యవస్థకు అండదండగా నిలవనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. ఉద్యోగుల వేతనాలు పెరిగే కొద్దీ దేశానికి లాభాలేనని, ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకాలు దూసుకెళ్తాయని, సొంతింటి కల నెరవేర్చుకునే వారి సంఖ్య పెరగడం సిమెంటుకు డిమాండును తెస్తుందని వివరించింది. ఆరవ వేతన సంఘం సిఫార్సులు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 35 శాతం మేరకు పెంచనున్న సంగతి తెలిసిందే. వీరందరికీ 30 నెలలకు పైగా ఎరియర్స్ ఒక్కసారిగా రావాల్సి వుంది. వేతన సంఘం సిఫార్సులు అక్టోబర్ 2008 నుంచి అమలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చాయి. వీరికి ఎయియర్స్ రూపంలో వచ్చే డబ్బు, తదుపరి మూడు నుంచి ఐదు సంవత్సరాల వృద్ధిని ప్రభావితం చేయనుందని రెలిగేర్ భారత చీఫ్ ఎకానమిస్ట్ జై శంకర్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటికే 7వ వేతన సంఘం తదుపరి వేతనాల పెంపుపై తన పనిని దాదాపు పూర్తి చేసింది. ఈ నెలాఖరులో లేదా అక్టోబరులో నివేదిక రానుంది. జనవరి 2016 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన పెంపుపై ఈ సంఘం సిఫార్సులు చేయనుంది. ఈ సిఫార్సులు అమలైతే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మొత్తం కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు లాభం పొందనున్నారు. 15 శాతం వరకూ వేతనాలు పెంచాలని 7వ వేతన సంఘం సిఫార్సు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా, 28 నుంచి 30 శాతం ఉండవచ్చని రెలిగేర్, 40 శాతం వేతనాలు పెరుగుతాయని క్రెడిట్ సూస్ అంచనా వేస్తున్నాయి. వేతనాలు పెరిగితే వృద్ధి రేటు ఎలా ప్రభావితమవుతుందంటే... * 15 శాతం వేతనాలు పెరుగుతాయని భావిస్తే, కేంద్ర ఖజానా నుంచి రూ. 25 వేల కోట్లు ఉద్యోగుల చేతుల్లోకి వస్తాయి. మొత్తం జీడీపీలో ఇది 0.2 శాతం. ఈ డబ్బు వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. * సుమారు మూడింట ఒక వంతు మధ్య తరగతి ప్రజులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. వేతనాల పెంపు తరువాత వీరు మెరుగైన జీవనాన్ని పొందుతారు., టియర్ 3, టియర్ 4 పట్టణాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 నుంచి 60 శాతం మధ్య తరగతి వారే. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి ఊపందుకునేందుకు ఎంతో సహకరిస్తుంది. * వేతనాలు పెరిగితే, రుణాలపై కొనుగోలు చేసే కార్ల సంఖ్య, గృహాల కొనుగోలు రెట్టింపు అవుతుంది. కార్ల రుణాల విలువ రూ. 3.6 లక్షల కోట్లకు, హౌసింగ్ రుణాల విలువ రూ. 15 లక్షల కోట్లకు పెరుగుతాయి. * మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో సంస్కరణల అమలు వేగవంతమైతే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. * కాగా, ఒక్కసారిగా 30 నుంచి 40 శాతం మేరకు వేతనాలు పెరిగితే, అది కూడా మధ్య తరగతి ప్రజల్లో 35 శాతం మందికి ఒకేసారి లబ్ధి కలిగితే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగే ప్రమాదమూ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News