: 'మన్ కీ బాత్' చెప్పడం కాదు...'హిందూస్థాన్ కీ బాత్' వినండి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేతలను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మన్ కీ బాత్ దేశ ప్రజలకు చెప్పడం కాకుండా దేశ ప్రజల మన్ కీ బాత్ వినాలని ఆయన ప్రధానికి సూచించారు. నిరసనలు వ్యక్తం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల రాజీనామాలు కోరుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని, నూరు కోట్ల భారతావని అని స్పష్టం చేశారు. వ్యాపం కుభకోణంలో ఆ రాష్ట్ర ప్రజలు సమిధలయ్యారని, సుష్మాస్వరాజ్ చట్టాలు ఉల్లంఘించారని, వసుంధర రాజేకు, లలిత్ మోదీకి సంబంధాలు ఉన్నాయని అందుకే రాజీనామాలు కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలో రైతులు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయమే లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలకు జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా రాజీ పడే ప్రసక్తి లేదని, పోరాటం ఉద్ధృతిని పెంచుతామని ఆయన తెలిపారు.