: ఖాతాదారుల పట్ల బ్యాంకుల నిర్దయ: ఆర్బీఐ గవర్నర్ రాజన్


తమ ఖాతాదారుల పట్ల భారత బ్యాంకులు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పరపతి సమీక్ష తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ ముప్పావు శాతం మేరకు వడ్డీ రేట్లను తగ్గిస్తే, బ్యాంకులు కేవలం 0.3 శాతం మాత్రమే కస్టమర్లకు బదలాయించాయని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకునే పరపతి సమీక్షను జరిపామని ఆయన అన్నారు. ఆర్థిక స్థిరత్వానికి పెద్దపీట వేశామని, పురోగతి ప్రక్రియ కొనసాగుతుందని రాజన్ వివరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు. బ్యాంకులకు అదనపు మూలధనాన్ని అందించేందుకు కేంద్రం అంగీకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీంతో బ్యాంకుల వృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. మూలధనం నిల్వలు పెరిగితే, చెలామణిలోకి మరింత నగదును పంపే సౌలభ్యం దగ్గరవుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News