: నాగాలాండ్ వేర్పాటు వాద గ్రూప్ తో కీలక ఒప్పందం: మోదీ
నాగాలాండ్ వేర్పాటు వాద గ్రూప్ 'నాగా'తో కేంద్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఆరున్నర దశాబ్దాల పాటు సాగిన వేర్పాటు వాద పోరాటానికి 'నాగా' గ్రూప్ స్వస్తి చెప్పింది. రెండు దశాబ్దాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం 18 నెలల్లో అమలులోకి వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. దీనిని దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా ఆయన అభివర్ణించారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచే భారతదేశం ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ద్వారా అహింసపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన నాగా నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. భారతదేశం శాంతి నెలకొల్పేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.