: ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిన గ్రీస్... నామమాత్రపు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ


ఐదు వారాల పాటు మూతబడ్డ గ్రీస్ స్టాక్ మార్కెట్ సోమవారం నాడు తిరిగి తెరచుకోగా, ఇన్వెస్టర్లకు చుక్కలు కనపడ్డాయి. ఏథెన్స్ స్టాక్ ఇండెక్స్ లో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో 23 శాతం పడిపోయింది. మొత్తం ఇండెక్స్ లో 20 శాతం వాటాను కలిగివున్న బ్యాంకింగ్ కంపెనీల ఈక్విటీలో 30 నుంచి 50 శాతం దిగజారాయి. దేశంలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకు 'నేషనల్ బ్యాంక్ ఆఫ్ గ్రీస్' 30 శాతం పడిపోయింది. బ్లూచిప్ కంపెనీలన్నీ భారీగా నష్టపోయాయి. దీంతో ట్రేడింగును నిలిపివేయగా, అప్పటికి 100 మిలియన్ యూరోల విలువైన అమ్మకపు ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇదిలావుండగా, ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు దిగినప్పటికీ, దేశవాళీ సంస్థాగత ఇన్వెస్టర్లు నూతన కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒడిదుడుకుల మధ్య సాగిన భారత స్టాక్ మార్కెట్ సెషన్లో సూచికలు నామమాత్రపు లాభాలతో సరిపెట్టుకున్నాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 72.50 పాయింట్లు పెరిగి 0.26 శాతం లాభంతో 28,187.06 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 10.20 పాయింట్లు పెరిగి 0.12 శాతం లాభంతో 8,543.05 పాయింట్ల వద్దా కొనసాగాయి. బ్యాంక్ నిఫ్టీ సూచిక 250 పాయింట్లు పెరిగింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితరాలు మంచి లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్ కాప్, స్మాల్ కాప్ 1 శాతానికి పైగా లాభంలో నిలవడం గమనార్హం.

  • Loading...

More Telugu News