: సెహ్వాగ్ ఆటను చూసి నేర్చుకో: కోహ్లీకి సూచించిన ద్రవిడ్
మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా నేడు శ్రీలంకకు బయల్దేరనుంది. పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తన తొలి పరీక్షను శ్రీలంకలో ఎదుర్కోనున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని సూచనలు చేశాడు. ఈ వివరాలను మీడియాకు కోహ్లీ వివరించాడు. 2008 శ్రీలంక పర్యటనలో అజంతా మెండిస్ మిస్టరీ బౌలింగ్ కు భారత బ్యాట్స్ మెన్ కకావికలయ్యారని... ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారని... అలాంటి సందర్భంలో కూడా సెహ్వాగ్ శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసి, 201 పరుగులు (మొత్తం స్కోరు 329) సాధించాడని... సెహ్వాగ్ కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచిన ఆ ఆటను చూసి నేర్చుకోవాలని తనకు ద్రవిడ్ సూచించాడని కోహ్లీ తెలిపాడు. సెహ్వాగ్ ఆడిన ఆ ఇన్నింగ్స్ శ్రీలంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని తనకు నేర్పిందని చెప్పాడు.