: ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు చాలా అధ్వానం!: కోదండరాం
ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలంగాణ జేఎసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. నిర్లక్ష్యం వల్లే ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. ఆసుపత్రిని బాగుచేయడానికి తమ వంతు సహకరిస్తామని, ఇందుకోసం పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చిస్తామన్నారు. అయితే కోదండరాం ఆసుపత్రి సూపరింటెండెంట్ గదికి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలోనే వైద్య సంఘాల వారు అక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా, చారిత్రక సంపదను కూల్చాల్సిన అవసరం లేదని కొందరు అనగా, ప్రభుత్వాన్ని కొందరు వైద్యులు తప్పుదారి పట్టిస్తున్నారని మరికొందరు ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిని బాగుచేస్తే సరిపోతుందని చెప్పారు. ఉస్మానియాను చంచల్ గూడకు తరలించాలని మరికొంతమంది వైద్యులు అభిప్రాయపడ్డారు. దాంతో కోదండరాం వైద్య సంఘాలకు సర్ది చెప్పారు. ఉస్మానియాలో పనిచేస్తున్న వైద్యుల సలహాలు తీసుకోకుండా బయటివారి సలహాలు తీసుకోవడం సరికాదన్నారు. దాంతో ఆసుపత్రి అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోదండరాం కోరారు. ఆసుపత్రిని బాగుచేయడం, పేదలకు వైద్యం చేయడమే ముఖ్యమన్నారు.