: గతంలో నెల్సన్ మండేలాకు ఇచ్చిన అవార్డును ఇప్పుడు ఓ నియంతకు ఇచ్చారు
యావత్ ప్రపంచం నివ్వెరబోయే ఘటన చోటుచేసుకుంది. నల్లసూరీడు, శాంతిదూత అయిన నెల్సన్ మండేలాకు గతంలో ఇచ్చిన 'గ్లోబల్ స్టేట్స్ మన్ షిప్' అవార్డును ఇప్పుడు కరుడుగట్టిన నియంతకు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, ఇండొనేషియాలోని బాలిలో ఉన్న 'సుకర్నో సెంటర్' ఈ అవార్డును ప్రకటించింది. ఈ సంస్థ అధ్యక్షురాలు, ఇండొనేషియా మాజీ అధ్యక్షుడు సుహార్తో కుమార్తె అయిన రచమవతి సుకర్నోపుత్రి ఈ అవార్డుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉల్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. తన తండ్రి ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళుతున్నందుకు కిమ్ జంగ్ ను ఈ అవార్డుతో గౌరవిస్తున్నట్టు ఆమె తెలిపారు. సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి వ్యతిరేకంగా కిమ్ జంగ్ పోరాడుతున్నారని కొనియాడారు. ప్రపంచమంతా అత్యంత ప్రమాదకరమైన నేతగా భావిస్తున్న కిమ్ జంగ్ ను గొప్ప రాజనీతిజ్ఞుడిగా 'సుకర్నో సెంటర్' గుర్తించడం విచిత్రమే.