: ర్యాగింగ్ కు పాల్పడితే జీవిత ఖైదే!... చట్టానికి సవరణలు తెస్తామంటున్న గంటా
విద్యాలయాల నుంచి ర్యాగింగ్ ను తరిమికొట్టేందుకు ఏపీ సర్కారు నడుం బిగించింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ర్యాగింగ్ కు పాల్పడే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టానికి సవరణ చేస్తామని చెప్పారు. అంతేకాక విద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి సంబంధించి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా కసరత్తు చేస్తున్నామని గంటా ప్రకటించారు.