: యాకూబ్ తరహాలోనే టెన్షన్ అనుభవిస్తున్న యువతి!
ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో యాకూబ్ మెమన్ ను ఉరితీయక ముందు హైడ్రామా నడిచింది. మెమన్ పిటిషన్ పై విచారణ కోసం వేళకాని వేళలో అర్ధరాత్రి తర్వాత సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకున్నాయి. తీవ్ర వాదోపవాదాల అనంతరం, అతడి పిటిషన్ తిరస్కరణకు గురైంది. తన పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియక మెమన్ ఆరోజు రాత్రి నాగ్ పూర్ జైల్లో నరకయాతన అనుభవించాడు. తీవ్ర ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఉరిశిక్ష అమలును సుప్రీం నిలిపివేస్తుందా? పిటిషన్ కొట్టివేతకు గురైతే తాను ఉరికంబం ఎక్కక తప్పదా?... ఇలాంటి ఆలోచనలతో మెమన్ సతమతమయ్యాడు. ఇప్పుడలాంటి పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది నేహా వర్మ అనే 27 ఏళ్ల యువతి. నేహా చేసిన నేరం ఏమిటో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడి, ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలను అత్యంత దారుణంగా చంపేసింది. వృత్తిరీత్యా ఇన్స్యూరెన్స్ ఏజెంటయిన నేహా విలాసాలకు అలవాటుపడి నేరాల బాట పట్టింది. బాయ్ ఫ్రెండ్ తో జల్సాలకు డబ్బు కోసం అడ్డదారిలో పయనించింది. మధ్యప్రదేశ్ లో 2011 జూన్ 19న నేహా తన గ్యాంగుతో కలిసి ఓ ఇంటిలో ప్రవేశించి రూ.1.5 లక్షలు దోచుకోవడమే కాకుండా , ఆ కుటుంబంలోని ముగ్గురు మహిళలను అత్యంత కిరాతకంగా అంతమొందించింది. ఈ కేసులో నేహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఇండోర్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వీరికి మరణశిక్ష విధించారు. జిల్లా కోర్టు, హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నేహా గ్యాంగు దారుణంపై త్వరలోనే అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. సుప్రీం ఎలాంటి నిర్ణయం వెలువరించనుందన్న విషయమై ఇప్పుడు నేహా వర్మతో పాటు ఆమె అనుచరులు ఉత్కంఠకు గురవుతున్నారు.