: యాకూబ్ ఉరితీతకు ముందూ, వెనుకా భారతీయత ఉట్టిపడింది: ఆర్ఎస్ఎస్ ప్రశంస
కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమన్ ఉరితీత అంశంలో భారతీయతను, మానవీయ కోణాన్ని ప్రదర్శించాయని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది. ఉరిశిక్ష అమలుకు ముందు యాకూబ్ కు కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని కల్పించారని, ఉరితీత అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారని ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ ఇంద్రేశ్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెమన్ అంత్యక్రియలపై పెద్దగా ఆంక్షలు విధించకుండా, బంధుమిత్రులను, ఇతరులను అనుమతించారంటే అది ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమని తెలిపారు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం తమ చర్యలతో భారతీయతను ప్రతిబింబించాయని ఆయన కొనియాడారు.