: ప్రత్యేక హోదా ఇవ్వకుంటే... హైదరాబాద్, సికింద్రాబాద్ లను యూటీ చేయండి: జూపూడి డిమాండ్
ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించడంతో ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చడానికి సహకరించడమే కాక, ఇప్పుడు ప్రత్యేక హోదా లేదనడం ఏపీని అణగదొక్కడమే అవుతుందని సీమాంధ్ర వాసులు అంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ప్రకటనపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా లేదనే పక్షంలో... వెంటనే హైదరాబాద్, సికింద్రాబాద్ లను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే తరహా డిమాండ్ ఏపీ వ్యాప్తంగా ఊపందుకుంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాకు ఓకే చెప్పిన బీజేపీ తన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని అన్నారు.