: సీరియల్ నిర్మాతపై కోర్టుకెక్కనున్న ఆర్పీ పట్నాయక్
టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ఆర్పీ పట్నాయక్ ఓ సీరియల్ నిర్మాతపై కోర్టుకెక్కనున్నారు. స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'తులసీదళం' సినిమా పాటలను అనుమతి లేకుండా 'అత్తో అత్తమ్మ కూతురో' అనే టీవీ సీరియల్ లో ఉపయోగించారని ఆర్పీ మండిపడ్డారు. అందుకే ఆ సీరియల్ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నామని, రూ.50 లక్షల పరిహారం కోరుతూ దావా వేస్తున్నామని తెలిపారు. సీరియళ్లలో సినిమా పాటలు వాడుకోవడం మామూలేనని, కానీ, తమ చిత్రం ఇంకా విడుదల కాలేదని, విడుదల కాని సినిమా పాటలను సీరియల్ లో ఉపయోగించడం ఎంతవరకు సబబని ఆర్పీ ప్రశ్నించారు. 'అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ జెమినీ టీవీలో ప్రసారమవుతుంది. కాగా, తులసీదళం సినిమాకు ఆర్పీ కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. నిర్మాత కూడా ఆయనే!