: కోదండరాం రాజకీయాల్లోకొస్తారు... ఎప్పుడంటే ?: టీ మంత్రి ఆసక్తికర కామెంట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)దే కీలక భూమిక. అందులోనూ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంది మరింత కీలక పాత్ర. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఇది ముమ్మాటికీ నిజం. తెలంగాణ ఉద్యమంలో ముందు వరసలో ఉండి పోరాడిన వారితో పాటు వెనుక బెంచీల్లోని వారు కూడా ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే, కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. అయితే ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరాం మాత్రం రాజకీయాల్లోకి కూడా రాలేదు. ఇదే విషయంపై నేటి ఉదయం చిలకలగూడలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ మరుక్షణమే రాజకీయాల్లోకి రావాలని కోదండరాంను కోరామని ఆయన పేర్కొన్నారు. అయితే, తెలంగాణ సమాజం బాగుపడ్డ తర్వాతే తాను రాజకీయాల్లోకి వస్తానని కోదండరాం చెప్పారని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం కోదండరాం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తోందని కూడా పద్మారావు వ్యాఖ్యానించారు.