: ఒక్క ఢిల్లీలోనే కాదు... దేశవ్యాప్తంగానూ అత్యాచారాలు జరుగుతున్నాయి: కేంద్ర హోంమంత్రి


ఒక్క ఢిల్లీలోనే కాదనీ, దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయనీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజు షిండే ఉభయసభల్లో ఓ ప్రకటన చేశారు. తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో ఐదేళ్ల బాలికపై ఈనెల 15న అత్యాచార ఘటన జరిగిందని చెప్పారు. అదే రోజు బాలిక అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. 17వ తేదీన బాలిక కుటుంబం ఉంటున్న మొదటి ప్లాట్ కింది ఫ్లోర్ లో బాలిక తల్లికి ఏడుపు శబ్దం వినిపించి వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం తాళం వేసున్న ఓ గదిలో చిన్నారిని గుర్తించినట్లు వెల్లడించారు.

అక్కడినుంచి దగ్గర్లోని స్వామి దయానంద ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించినట్లు చెప్పారు. అప్పుడే బాలికపై దారుణంగా అత్యాచారం జరిగిందని నిర్ధారించినట్లు తెలియజేశారు. అక్కడి నుంచి నాణ్యమైన చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించామని, ప్రస్తుతం బాలిక కోలుకుంటోందనీ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. అయితే, విషయం బయటికి పొక్కుకుండా బాలిక తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వజూపిన స్థానిక పోలీసులపైనా సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.

కేసులో ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్న షిండే, మొదటి నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్డడీలో ఉన్నాడని చెప్పారు. ఇదిలావుంటే.. ఈ ఘటనపై తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ స్పష్టం చేశారు. తన రాజీనామావల్ల బాలికకు ఎలాంటి సహాయం జరగదన్నారు. తన రాజీనామావల్ల అత్యాచార ఘటనలు ఆగుతాయనుకుంటే వెయ్యిసార్లు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News