: ఇళ్ల కొనుగోలుదారులకు లాభం చేకూరుస్తున్న బిల్డర్ల కొత్త రూటు!
భారత నిర్మాణ రంగంలో పెరిగిన ధరలు, బలహీనంగా ఉన్న అమ్మకాల నేపథ్యంలో బిల్డర్ల వ్యూహాలు మారాయి. సాధ్యమైనంత తక్కువ ధరకు కస్టమర్లకు సొంతింటి సౌకర్యం కల్పించాలని భావిస్తున్న నిర్మాణ రంగ సంస్థలు అవలంబిస్తున్న కొత్త రూటేంటో తెలుసా? అపార్టుమెంట్ల సైజు తగ్గించడం. 1000 చదరపు అడుగులు ఉండే అపార్టుమెంటు సైజును 850 అడుగులకు తగ్గించడం ద్వారా ఆరు అపార్టుమెంట్లు పట్టే చోట ఏడో అపార్టుమెంటు నిర్మించి, ఆ లాభాన్ని కస్టమర్లకు పంచాలన్నదే బిల్డర్ల నయా స్ట్రాటజీ. ఐదేళ్ల క్రితం సరాసరి అపార్టుమెంట్ సైజుతో పోలిస్తే, ప్రస్తుతం ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్ కతా నగరాల్లో అపార్టుమెంట్ ఏరియా గణనీయంగా తగ్గింది. గత ఐదేళ్లలో ముంబైలో టూ బెడ్ రూం అపార్టుమెంట్ సైజు 26.4 శాతం తగ్గితే, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో 22 నుంచి 24 శాతం తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ ఇండియా సీఎండీ అనుజ్ పూరి వివరించారు. మెట్రో నగరాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు బిల్డర్లు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అన్నారు. పలు పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రజలు ఈ తరహా ఇళ్లనే కోరుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. కుటుంబ అవసరాలు, లైఫ్ స్టయిల్ కు తగ్గట్టు ఎక్కువ గదులుండే చిన్న ఇళ్ల దిశగా ప్రజల అడుగులు పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.