: కలాం జీవితం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలివిగో!
ప్రజల రాష్ట్రపతిగా, మిసైల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం జీవితంలో ఎంతో మందికి తెలియని ఆసక్తికర విషయాలివి. * రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టక పూర్వం రక్షణ రంగంలో సాంకేతికతపై సేవలందించిన ఆయన, కేవలం ఒకే ఒక గది కలిగివున్న ఫ్లాట్ లో నివసిస్తుండేవారు. * ఆయన చిన్నతనంలో ముగ్గురు ప్రాణ స్నేహితులుండేవారు. వారు రామనాథ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్. ముగ్గురూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారే. * రామేశ్వరంలో ప్రముఖ పూజారి పక్షి లక్ష్మణశాస్త్రి కలాం తండ్రికి దగ్గరి స్నేహితుడు. * కలాంకు కర్ణాటక సంగీతమన్నా, ఎంఎస్ సుబ్బులక్ష్మి పాటలన్నా ఎంతో ఇష్టం. వారిద్దరూ తరచూ కలసుకునేవారు. కలాంకు ఎంఎస్ స్వయంగా వండి వడ్డించేది. ఇద్దరూ నేలపై కూర్చుని అరిటాకుల్లో భోజనం చేసేవారు. * కలాంకు దక్షిణాది వంటకాలంటే ఇష్టం. అందునా ఇడ్లీలంటే మరింత ఇష్టం. * రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఢిల్లీ వచ్చేందుకు ఉచిత విమాన టికెట్లను కేంద్రం ఆఫర్ చేసినా, నిరాడంబర జీవితానికి ప్రాధాన్యమిచ్చే ఆయన, అటువంటి సౌకర్యాలు వద్దని చెప్పి, తనవారికి సెకండ్ క్లాస్ ఏసీ ట్రయిన్ టికెట్లు మాత్రమే పంపారు. * ఇండియాకు తొలి అవివాహిత రాష్ట్రపతిగా ఉన్న ఆయన, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి, వేదికపై కూర్చునేందుకు ఇష్టపడలేదు. దీనికి ఆయన చెప్పిన కారణం, మిగతా అతిథులకు వేసిన కుర్చీలతో పోలిస్తే తన కుర్చీ పెద్దదిగా ఉండటమే. * తన ఇంట ఓ పగిలిన అద్దం గోడపై ఉండటాన్ని చూసి అది, పక్షులకు హాని కలిగించవచ్చంటూ, దాన్ని అక్కడి నుంచి తీసివేయించిన సహృదయం కలాంకే సొంతం. * సుమారు 400 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్న వేళ కరెంటు పోయింది. తన ప్రసంగాన్ని ఆపకుండా, విద్యార్థుల మధ్యకు వెళ్లి, అందరూ తన చుట్టూ రావాలని చెప్పి ప్రసంగాన్ని కొనసాగించారు కలాం. * రాష్ట్రపతి హోదాలో కేరళలోని రాజ్ భవన్ కు తొలిసారిగా వెళ్లినప్పుడు కలాం తొలి 'ప్రెసిడెన్షియల్ గెస్ట్' ఎవరో తెలుసా? రోడ్డు పక్కన కొబ్బరి కాయలు అమ్మే వ్యక్తి, ఓ చిన్న హోటల్ యజమాని.