: పట్టాలపై బాంబులు పెట్టారని ఎలా కనుగొన్నానో తెలుసా?: రైల్వే గేట్ మేన్
పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ ను ఆక్రమించుకునేందుకు ముందు ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పూనుకున్నారు. దీంతో గుర్ దాస్ పూర్ జిల్లాలో చొరబడిన ఉగ్రవాదులు తెల్లవారుజామున ఓ వంతెనపై బాంబులు అమర్చారు. ఈ బాంబులను గుర్తించిన రైల్వే గేట్ మేన్ సత్పాల్ స్పందించారు. జరిగిన ఘటను ఆయన వివరిస్తూ, "రోజూలాగే పాలప్యాకెట్లు తెచ్చుకునేందుకు రైల్వే వంతెనపక్క నుంచి వెళ్తుండగా, వంతెనపై వైర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అటుగా వెళ్తున్న ఓ యువకుడ్ని పిలిచి స్టేషన్ కు సమాచారం పంపాను. డ్యూటీలో ఉన్న దర్శన్ కుమార్ వెంటనే స్పందించి, అప్పటికే బయల్దేరిన ఓ ట్రైన్ ను వంతెనను చేరుకునే లోపు ఆపేందుకు ఓ గార్డును పంపారు. గార్డు పరుగున వెళ్లి సకాలంలో ఆ ట్రైన్ ను ఆపారు" అని గుర్తు చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. ట్రైన్ అక్కడికి చేరుకునే సమయంలో అందులో 250 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన వెల్లడించారు.