: పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ ఇక లేనట్టే!


పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు చొరబడి బీభత్సం సృష్టించడం తెలిసిందే. ఆ టెర్రరిస్టులు పాకిస్థాన్ నుంచే వచ్చారన్న విషయం తెలియడంతో మరోమారు దాయాది చిత్తశుద్ధిపై సందేహాలు నెలకొన్నాయి. కాగా, ఇటీవలే పాక్ క్రికెట్ బోర్డు పెద్దలు భారత్-పాక్ క్రికెట్ సిరీస్ ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే, అందుకు రాజకీయపరమైన అడ్డంకులు తొలగిపోవాల్సి ఉందని బీసీసీఐ అభిప్రాయపడింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా సిరీస్ కష్టమేనని కూడా బీసీసీఐ పెద్దలు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు గురుదాస్ పూర్ ఘటనతో భారత్-పాక్ క్రికెట్ సంబంధాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇక భవిష్యత్తులో పాక్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఉండకపోవచ్చని భారత క్రికెట్ వర్గాలంటున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ సిరీస్ ఉండబోదని స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడేదాకా పాక్ బోర్డుతో సంబంధాల పునరుద్ధరణ ఉండదని పేర్కొన్న బీసీసీఐతో తాను ఏకీభవిస్తున్నట్టు గంగూలీ తెలిపారు.

  • Loading...

More Telugu News