: కలాం సర్ ఇంట్లో టీవీయే ఉండేది కాదు!: వ్యక్తిగత సెక్రెటరీ హ్యారీ షెరిడన్
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇకలేరు అన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శి హ్యారీ షెరిడన్ జీర్ణించుకోలేకపోతున్నారు. గత 24 ఏళ్ల నుంచి కలాంకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న హ్యారీ... ఆయన ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా మిడ్-డే వార్తా చానల్ తో హ్యారీ మాట్లాడుతూ, "సర్ (కలాం) సోమవారం మధ్యాహ్నం 12.20కి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రానికి అక్కడి నుంచి తిరిగి రావల్సి ఉంది. ఆయన ఢిల్లీ నుంచి వెళ్లేముందు ఆరోగ్యం చాలా బాగుంది. దాదాపు నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మా సిబ్బందికి చెందిన ఒకరి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. షిల్లాంగ్ లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా కలాం కుప్పకూలిపోయారని, ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. మళ్లీ కొన్ని నిమిషాలకే వారు నాకు ఫోన్ చేశారు. మిస్టర్ కలాంను పరీక్షించిన మిలటరీ వైద్యులు ఆయన చనిపోయారని ప్రకటించారని నాకు చెప్పారు" అని వివరించారు. ఇదే సమయంలో కలాంకు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. కలాం ఇంట్లో ఎప్పుడూ టీవీయే ఉండేది కాదన్నారు. ఉదయం 6.30 లేదా 7 గంటల ప్రాంతంలో ఆయన తన రోజును ప్రారంభిస్తారని, అప్పటి నుంచీ తెల్లవారుజామున 2 గంటల వరకు మెలకువగానే ఉంటారని చెప్పారు. ఎప్పుడూ రేడియో వింటుంటారని, దాదాపు వార్తలన్నీ ఆల్ ఇండియా రేడియోలోనే వినేవారని వెల్లడించారు. అంతేగాక ప్రతిరోజు తన మెయిల్స్ తానే చెక్ చేసుకునే వారన్నారు. పలుచోట్ల నుంచి సెమినార్లకు, ఇతర కార్యక్రమాలకు కలాంకు వారానికోసారి ఆహ్వానాలు వచ్చేవన్నారు. వ్యక్తిగత ఫిజీషియన్ ప్రతిరోజు వచ్చి కలాంను పరీక్షించేవారని, కానీ ఎప్పుడూ ఏ సమస్య ఉందని చెప్పలేదన్నారు. చివరిసారిగా 'టార్గెట్ 3 బిలియన్' పేరుతో కలాం రాసిన పుస్తకం డిసెంబర్ 2011లో పబ్లిష్ అయినట్టు హ్యారీ వివరించారు. కలాం సర్ అన్ని కోణాల్లోనూ మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషని కొనియాడారు. ఆయనవంటి నాయకుల అవసరం దేశానికి ఉందని పేర్కొన్నారు. డిఫెన్స్ మినిస్టర్ కు సైంటిఫిక్ సలహాదారుగా కలాం పని చేస్తున్నప్పటి నుంచి కలాంతో పనిచేస్తున్న హ్యారీ, తరువాత డిపార్ట్ మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో చేరాక సెక్రెటరీగా చేస్తూ వచ్చారు.