: బీజేపీకి 'బాహుబలి' మద్దతు? పవన్ కు చెక్ పెట్టగలడా?
'బాహుబలి' భారీ విజయం సాధించిన నేపథ్యంలో హీరో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో కలసి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నాడు. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలను ప్రభాస్ కలిశాడు. ఈ క్రమంలో, నేతలందరి వద్ద బాహుబలి అఖండ విజయం గురించి మాట్లాడుతూ, వారిని సినిమా చూడాలని కోరుతున్నాడు. ప్రధాని మోదీ కూడా ప్రభాస్ నటన గురించి కొందరు నాయకులు చెప్పగా విని, సినిమా తప్పకుండా చూస్తానని చెప్పారట. రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ అయితే ప్రభాస్ ను శెహభాష్ అన్నారు. ఈ క్రమంలో, ప్రభాస్ సినీ ఇమేజ్ ఏంటో ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతల వరకు పాకింది. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలను ప్రభాస్, కృష్ణంరాజులు కలుస్తుండటంతో... ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రభాస్ ముందుకు వస్తాడని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీలో తన పెదనాన్న కృష్ణంరాజు ప్రాభవం పెరిగేందుకు ప్రభాస్ ఉపయోగపడతాడని అంటున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కు తోడుగా ప్రభాస్ కూడా బీజేపీకి సహకారం అందిస్తాడని చెబుతున్నారు. ఒకవేళ, జనసేన నేరుగా ఎన్నికల బరిలోకి దిగితే, అప్పుడు పవన్ కు కొంత మేరైనా చెక్ పెట్టేందుకు ప్రభాస్ ఉపయోగపడతాడని బీజేపీ భావిస్తోందన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, పవన్ కు ప్రభాస్ కొంత మేరకైనా చెక్ పెట్టగలడా? అన్న చర్చలు కూడా కొనసాగుతున్నాయి.