: బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు
మండల్ (వెనుకబడిన తరగతుల ప్రజలు) కమండలాన్ని (బీజేపీని) కూకటివేళ్లతో పెకలించాలని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. బీహార్ లో కులగణన లెక్కలను బయటపెట్టడంలో కేంద్రం వైఫల్యానికి నిరసనగా లాలూ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో బీహార్ లో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ సందర్భంగా పాట్నాలోని డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద లాలూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మిలటరీ బేస్ క్యాంప్ వద్ద శిబిరానికి పంపారు. ఆయనతో పాటు వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. కులగణన లెక్కలను బహిర్గతం చేయకపోతే 1990ల నాటి మండల్ ఉద్యమం కంటే తీవ్రస్థాయి ఉద్యమాన్ని చేపడతామని లాలూ హెచ్చరించారు.