: నేలకొరిగిన పంజాబ్ ఎస్పీ బల్జీత్ సింగ్...పోలీసు కాల్పుల్లో మరో ముష్కరుడు హతం
పంజాబ్ లో పేట్రేగిన ఉగ్రవాదుల దాడుల్లో ఎస్పీ స్థాయి అధికారి నేలకొరిగారు. నేటి తెల్లవారుజామున భారత భూభాగంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఓ బస్సుపై కాల్పులు జరిపిన తర్వాత దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ముప్పేట దాడికి దిగారు. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదుల దాడితో క్షణాల్లో మేల్కొన్న దీనానగర్ పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. అయితే అప్పటికే అక్కడికి సమీపంలోని పోలీస్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పోలీసులపై ఫైరింగ్ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్జీ బలగాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్పీ స్థాయి అధికారి బల్జీత్ సింగ్ వీరమరణం పొందారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాదుల్లోని మరో ముష్కరుడు కూడా హతమయ్యాడు. దీంతో పోలీసుల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య రెండుకు చేరింది.