: మ్యాగీ మళ్లీ వస్తుందట... నెస్లే ఇండియా ఎండీగా భారతీయుడి నియామకం
మ్యాగీ నూడుల్స్ కు భారత్ లో కష్టకాలం ఎదురైన నేపథ్యంలో నెస్లే ఇండియా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. మ్యాగీ నూడుల్స్ ను మళ్లీ భారత్ లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నెస్లే తన ఇండియా విభాగానికి ఎండీగా ఓ భారతీయుడిని నియమించింది. నెస్లే ఇండియా ఎండీగా వ్యవహరిస్తున్న ఎటియన్నే బెన్నెట్ స్థానంలో సురేశ్ నారాయణన్ ను తీసుకువస్తున్నారు. మ్యాగీపై నిషేధం విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎదుట తమ వాదనలు వినిపించేందుకు అవకాశం దక్కలేదని నెస్లే ఇండియా భావిస్తోంది. ఈ విషయంలో నారాయణన్ సమర్థంగా వ్యవహరిస్తారని కంపెనీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అందుకే, నెస్లే ఫిలిప్పీన్స్ కు చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్న నారాయణన్ ను భారత్ తీసుకువస్తున్నారు. కాగా, బెన్నెట్ ను స్విట్జర్లాండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.