: లంక టూర్ కోహ్లీకి సవాలే!


శ్రీలంకతో వచ్చే నెలలో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించడంతో క్రికెట్ ఊపు మళ్లీ మొదలైంది. కాగా, లంకతో మూడు టెస్టుల సిరీస్ విరాట్ కోహ్లీ నాయకత్వ సామర్థ్యాలకు పరీక్ష పెట్టనుంది. దిగ్గజం కుమార సంగక్కర రిటైర్ కానుండడంతో అతడికి విజయంతో వీడ్కోలు పలకాలని లంకేయులు భావిస్తున్నారు. దీంతో, వారు హోరాహోరీగా పోరాడతారు. ఇప్పుడిప్పుడే కెప్టెన్ గా కుదురుకుంటున్న కోహ్లీకి ఇది ప్రతికూలాంశం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు కోహ్లీ పోరాట పటిమ అలవర్చాల్సి ఉంటుంది. ఇక, లంక పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తుండడంతో జట్టు కూర్పు ఎలా ఉండాలన్న విషయం కోహ్లీని కచ్చితంగా ఆలోచింపజేసేదే. కోహ్లీ కాకుండా... శిఖర్ ధావన్, మురళీ విజయ్, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్... వీళ్లే జట్టుకు ఎంపికైన ఇతర బ్యాట్స్ మెన్. అయితే, ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, ఓ వికెట్ కీపర్, నలుగురు బౌలర్ల కూర్పుతో బరిలో దిగాలా? లేక, ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, ఓ వికెట్ కీపర్, ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు (ముగ్గరు స్పిన్నర్లు)తో బరిలో దిగాలా? అన్నది నిజంగా సవాలే. ఎందుకంటే, సొంతగడ్డపై లంక బెబ్బులే. టాస్ తో పాటు జట్టు కూర్పు కూడా ఆ ద్వీపదేశంతో మ్యాచ్ ల సందర్భంగా కీలకమవుతుంది. ఈ విషయం అన్ని జట్లకు అనుభవమే. బ్యాటింగ్ విషయానికొస్తే ధావన్, విజయ్ లు ఓపెనర్లుగా వచ్చే అవకాశాలున్నాయి. రహానే, పుజారా, రాహుల్ మంచి ఫామ్ లో ఉండడంతో వారిలో ఎవరికి చాన్స్ దక్కుతుందన్నది కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వికెట్ కీపర్ గా సాహాకు ఎలాగూ చాన్స్ లభిస్తుంది. బౌలింగ్ విభాగంతోనూ ఈ యువ సారథికి చిక్కులు తప్పేలా లేవు. స్పిన్ కోటాలో హర్భజన్, అశ్విన్, మిశ్రా చోటు దక్కించుకుంటారు. అయితే, పేస్ విభాగంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్, భువనేశ్వర్ కుమార్ లలో ఎవరిని ఎంచుకోవాలన్నది కోహ్లీకి కాస్త కష్టమే.

  • Loading...

More Telugu News