: అమెరికాపై మరో ఉగ్ర దాడి!... సినిమా హాల్ పై కాల్పులతో విరుచుకుపడ్డ గన్ మెన్
పెద్దన్న అమెరికా మరోమారు ఉగ్రదాడితో వణికిపోయింది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ఓ థియేటరుపై అత్యాధునిక తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 58 ఏళ్ల వ్యక్తి, లూసియానాలోని లాఫయేత్ లో 'ట్రైన్ వెర్క్' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సినిమా హాల్ లోకి గురువారం రాత్రి 7 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 5:30 గంటలు) తుపాకీతో వచ్చాడు. వచ్చీ రాగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆపై మందుగుండు అయిపోయే సమయంలో తనను తాను కాల్చుకుని మరణించాడు. కాల్పులు జరిపేముందు అతనేమీ మాట్లాడలేదని, అతని ఉద్దేశం ఏంటో కూడా తెలియదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు సుమారు 100 మంది వరకూ సినిమా చూస్తున్నట్టు వివరించాడు. దీని గురించి తెలుసుకున్న లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని, ఇటువంటి వాటితో తమను భయపెట్టలేరని అన్నారు. అతను ఎవరన్న విషయాన్ని విచారిస్తున్నట్టు పోలీసులు వివరించారు.