: ఏం మాట్లాడారు శశీజీ... సూపర్!: కాంగ్రెస్ నేతకు మోదీ ప్రశంసలు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల ఆక్స్ ఫర్డ్ డిబేట్ లో శశీజీ ప్రసంగం తాలూకు వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోందని అన్నారు. భారత్ ను రెండు శతాబ్దాల పాటు వలస పాలనలో మగ్గేలా చేసిన యూకే పరిహారం చెల్లించాలంటూ థరూర్ తన ఉపన్యాసంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా థరూర్ అద్భుతమైన వాగ్ధాటితో ఆకట్టుకున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. సరైన ప్రదేశంలో సరైన వాదనలు వినిపించారని కొనియాడారు. థరూర్ ప్రసంగంలో దేశభక్తి భావనలు ఉట్టిపడ్డాయని అన్నారు. ఢిల్లీలో పార్లమెంటు హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని పైవిధంగా పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీని పలుమార్లు పొగిడి చిక్కుల్లో పడ్డ థరూర్ పై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. థరూర్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఆందోళనలు, నినాదాలతో పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డుతగలరాదని థరూర్ సొంత పార్టీ నేతలకు హితవు పలకడమే మేడమ్ ఆగ్రహానికి కారణమైంది.