: ప్రతిభ ఉంది...సత్తా చాటాలి: వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా యువ జట్టులో ఎంతో ప్రతిభ దాగుందని సీనియర్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శ్రీలంక సిరీస్ లో భారత్ సత్తా చాటుతుందని ఆశిస్తున్నానన్నాడు. జట్టు సమష్టిగా ఆడితే శ్రీలంకపై విజయం సాధించడం కష్టం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లుగా టీమిండియా టెస్టుల్లో కష్టపడి ఆడుతోందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు ప్రతిభావంతులని, పూర్తి సామర్థ్యంతో ఆడితే శ్రీలంకను ఓడించడం సులువని అన్నాడు. అదే సమయంలో భారత్ ను ఓడించి, సంగక్కరకు గ్రాండ్ ఫేర్ వెల్ ఇవ్వాలని శ్రీలంక జట్టు భావిస్తుందని, అందువల్ల రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని లక్ష్మణ్ తెలిపాడు. టీమిండియా అప్రమత్తంగా ఉండాలని లక్ష్మణ్ సూచించాడు. కాగా, భారత్-శ్రీలంక సిరీస్ లో ఆగస్టు 12న తొలి టెస్టు ప్రారంభం కానుండగా, టెస్టు జట్టును బీసీసీఐ రేపు ప్రకటించనుంది.